Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 328-2
సంపుటము: 4-161
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
చూడవమ్మ కృష్ణుఁడు నీ సుతుఁ డోయమ్మ
ఆడీ వీధుల వెంట యశోదమ్మా
॥పల్లవి॥
కోలలు చాఁచీ వుట్లు గొట్టఁగా బాలుఁ బెరుగు
కాలువలు గట్టి పారెఁ గదవమ్మా
మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో
ఆలకించి వినవమ్మ యశోదమ్మా
॥చూడవమ్మ॥
చక్కిలాల కుండలెల్లా చలాన దొండ్లు వొడిచి
దిక్కన దోఁటికోలలఁ దీసీనమ్మా
చిక్కని తేనె చాడె చివ్వన రాత వేసితే
అక్కడ జోరునఁ గారె యశోదమ్మా
॥చూడవమ్మ॥
అల్లంత నుండి తన కందరాని తెంకాయలు
వల్లె తాళ్ళు వేసి వంచీనమ్మా
బల్లిదుఁడలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు
అల్లిబిల్లై యున్నాఁడమ్మ యశోదమ్మా
॥చూడవమ్మ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము