Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 328-3
సంపుటము: 4-162
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
ఎంచి చూచితే నితని కెవ్వ రెదురు
కొంచఁ డేమిటికి వీఁడె ఘోరనారసింహుఁడు
॥పల్లవి॥
గక్కన నహోబలాన కంబములోన వెడలి
వుక్కుమీరి హిరణ్యుని నొడిసిపట్టి
చెక్కలువార గోళ్లఁ జించి చెండాడినయట్టి-
వెక్కసీఁడు వీఁడివో వీర నారసింహుఁడు
॥ఎంచి॥
భవనాసి యేటిదండఁ బాదుకొని కూచుండి
జవళి దైత్యుపేగులు జందేలు వేసి
భువియుదివియు నొక్కపొడవుతో నిండుకొని
తివురుచున్నాఁడు వీఁడె దివ్య నారసింహుఁడు
॥ఎంచి॥
కదిసి శ్రీసతి గూడి గద్దెమీఁదఁ గూచుండి
యెదుటఁ బ్రహ్లాదుఁడు చేయేత్తి మొక్కఁగా
అదన శ్రీవేంకటాద్రి నందరికి వరాలిచ్చి
సదరమైనాఁడు వీఁడె శాంత నారసింహుఁడు
॥ఎంచి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము