అధ్యాత్మ సంకీర్తన
రేకు: 328-4
సంపుటము: 4-163
రేకు: 328-4
సంపుటము: 4-163
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| కొలువై తా నల్లవాఁడె కూచున్నాఁడు గద్దెమీఁద బలవంతుఁ డితఁడు ప్రహ్లాదవరదుఁడు | ॥పల్లవి॥ |
| చిడుముడిగోళ్లతోడ సింహపుమోముతోడ తొడమీఁదఁగూచున్న తొయ్యలితోడ కడలేనినవ్వుతోడ కడురాజసముతోడ అడరించీఁ బంతము ప్రహ్లాదవరదుఁడు | ॥కొలు॥ |
| సంకుఁజక్రములతోడ చాయలమేనితోడ సంకెదేర్చేయభయహస్తముతోడ బింకపుమీసాలతోడ పెనువదనముతోడ అంకె వరములిచ్చీఁ బ్రహ్లాదవరదుఁడు | ॥కొలు॥ |
| వనితకౌఁగిటతోడ వామకరముతోడ ననుపైన తమలోనానందముతోడ యెనయుచు శ్రీవేంకటేశుఁడై యీడా నాడా అనిశము వెలసెఁ బ్రహ్లాదవరదుఁడు | ॥కొలు॥ |


