Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 330-4
సంపుటము: 4-175
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
ఎంత పరాక్రమము యీ సింహము
చెంతనే దివిజులు సేవించేరు
॥పల్లవి॥
కొండమీఁదఁ గూచుండి దైత్యుమై
చెండివేసె నీ సింహము
నిండునగవుతో నెలఁత దనతొడపై
నుండఁగ నెరసీ నుదుటుఁదనమున
॥ఎంత॥
తటుకనఁ బ్రహ్లాదుఘటనచేఁ గంభము
చిటిలి వెడలె నీ సింహము
చటులకరంబులఁ గుటిలదానవుని
బటుగతిఁ బట్టెను పశుబంధముగా
॥ఎంత॥
పగయెల్ల నడఁచి జగములేలుచును
జిగిమించిన నరసింహము
నిగిడి శ్రీవేంకటనిధి యహోబలము
తగు నివాసముగఁ దనరీ నిదివో
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము