అధ్యాత్మ సంకీర్తన
రేకు: 331-4
సంపుటము: 4-181
రేకు: 331-4
సంపుటము: 4-181
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కౌశి
| కొండంత పొడవుతోడ కోనేటిరాయఁడు వీఁడె నిండుకొని రథమెక్కి నిలుచున్నవాఁడు | ॥పల్లవి॥ |
| పాతాళవాసులైన బలురక్కసుల మీఁద యేతులఁ బరపెఁ దేరు యిదె దేవుఁడు ఆతల జలధిచొచ్చినట్టి దానవులమీఁద ఘాతతోడఁ దోలె నదె కడు రభసమున | ॥కొండ॥ |
| ఆకాశము దూరినట్టి యదటు దైత్యులమీఁద దాకతో నడపించెఁ బంతాన దేవుఁడు దీకొని యష్టదిక్కులఁ దిరిగి యసురలపై భీకరముగా మోగించె బిరుదులు మెరసి | ॥కొండ॥ |
| ధరమీఁదఁ గలిగిన దనుజకోట్ల నెల్ల సొరిది శ్రీవేంకటేశుఁడు పారఁదోలెను గరిమ నలమేల్మంగ నురమునఁ బెట్టుకొని తిరముకొలిపెఁ దేరు దిక్కులెల్ల గెలిచి | ॥కొండ॥ |


