అధ్యాత్మ సంకీర్తన
రేకు: 331-5
సంపుటము: 4-182
రేకు: 331-5
సంపుటము: 4-182
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| నవమూర్తులైనట్టి నరసింహము వీఁడె నవమైన శ్రీకదిరి నరసింహము | ॥పల్లవి॥ |
| నగరిలో గద్దెమీఁది నరసింహము వీఁడె నగుచున్న జ్వాలానరసింహము నగముపై యోగానందనరసింహము వీఁడె మిగుల వేదాద్రి లక్ష్మీనారసింహము | ॥నవ॥ |
| నాఁటుకొన్న భార్గవూటునరసింహము వీఁడె నాఁటకపు మట్టెమళ్లనరసింహము నాఁటి యీ కానుగమానినరసింహము వీఁడె మేఁటి వరాహపు లక్ష్మీనారసింహము | ॥నవ॥ |
| పొలసి యహోబలాన బొమ్మిరెడ్డిచెర్లలోన నలిరేఁగిన ప్రహ్లాదనరసింహము చెలఁగి కదిరిలోన శ్రీవేంకటాద్రిమీఁద మెలఁగేటి చక్కని లక్ష్మీనారసింహము | ॥నవ॥ |


