అధ్యాత్మ సంకీర్తన
రేకు: 3-5
సంపుటము: 1-18
రేకు: 3-5
సంపుటము: 1-18
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద వెలుఁగు లోపలికి వెలుఁగేలా | ॥తెలియ॥ |
| అరయ నాపన్నుని కభయ మీవలెఁ గాక ఇరవైన సుఖిఁ గావనేలా వఱతఁ బోయెడివాని వడిఁ దీయవలెఁ గాక దరివానిఁ దివియంగఁ దానేలా | ॥తెలియ॥ |
| ఘనకర్మారంభుని కట్లు విడవలెఁ గాక యెనసిన ముక్తునిఁ గావనేలా అనయము దుర్బలుని కన్నమిడవలెఁ గాక తనసినవానికిఁ దానేలా | ॥తెలియ॥ |
| మితిలేని పాపకర్మికిఁ దా వలెఁ గాక హితవెఱుఁగు పుణ్యునికేలా ధృతిహీనుఁ గృపఁ జూచి తిరువేంకటేశ్వరుఁడు తతిఁ గావకుండినఁ దానేలా | ॥తెలియ॥ |


