అధ్యాత్మ సంకీర్తన
రేకు: 333-4
సంపుటము: 4-193
రేకు: 333-4
సంపుటము: 4-193
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఉండినట్టే వుండును వుండకున్న మానును అండనే శ్రీహరిమాయ నమరిన లోకము | ॥పల్లవి॥ |
| యేదైనా మంచిదే యెట్టయినా మంచిదే సేద దేరినట్టి పూర్ణచిత్తునకును కాదు గూడదనరాదు కలస్వభావమునకు ఆదినుండి హరిమాయ నత్తినడి లోకము | ॥ఉండి॥ |
| యెండైనా మంచిదే యెంతనీడైనా మంచిదే పండినజ్ఞానభక్తుల ప్రసన్నులకు నిండె నిండదనరాదు నిచ్చనిచ్చఁబ్రకృతికి కొండవంటిహరిమాయ గురియైనలోకము | ॥ఉండి॥ |
| పాపమైన మంచిదే బలుపుణ్యమైన మంచిదే శ్రీపతిని శరణన్నజీవునికిని వోప నోపేన రాదు వొద్దిక శ్రీవేంకటేశు చేపట్టినమాయలోనఁ జిక్కినది లోకము | ॥ఉండి॥ |


