Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 333-6
సంపుటము: 4-195
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
కటకటా యీ ప్రాణి గతి గనుట యెన్నఁడో
అటు నా వశము గాదు హరి నీచేఁ గాని
॥పల్లవి॥
పాపము నెరుఁగుదు బంధము నెరుఁగుదు
మాపుదాకా నివి నేను మానలేఁగాని
కోపము దుర్గుణమని కొంత గొంత యెరుఁగుదు
తీపుల యాసలఁ బడి తిప్పలేఁగాని
॥కట॥
చూతును దుఃఖాలవారిఁ జూతును బుట్టేవారి
యీతల నాకు వెరపు యించుక లేదు
గాతల నామనసెల్లఁ గల్పించినట్లవును
చేతనైనా చెప్పినట్టు సేయలేఁగాని
॥కట॥
నావంకఁ గడమ గాఁక నా గురుఁడు తొల్లె నన్ను
శ్రీవేంకటేశుఁడ నీచేతికిచ్చెను
దైవమొక్కఁడవే నీ దాసానుదాసుఁడనైతి
యేవిధులు నే నెరఁగ నిటు నిన్నేకాని
॥కట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము