Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 29-6
సంపుటము: 1-181
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
ఎంత విభవము గలిగె నంతయును నావదని
చింతించినది గదా చెడని జీవనము
॥ఎంత॥
చలముఁ గోపంబుఁ దనుఁ జంపేటి పగతులని
తెలిసినది యదిగదా తెలివి
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని
తొలఁగినది యదిగదా తుదగన్న ఫలము
॥ఎంత॥
మెఱయు విషయములే తనమెడనున్న వురులుగా
యెఱిఁగినది యదిగదా యెరుక
పఱివోని యాస దనుఁ బట్టుకొను భూతమని
వెఱచినది యదిగదా విజ్ఞానమహిమ
॥ఎంత॥
యెనలేని తిరువేంకటేశుఁడే దైవమని
వినఁగలిగినదిగదా వినికి
అనయంబు నతని సేవానందపరులయి
మనఁగలిగినదిగదా మనుజులకు మనికి
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము