Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 30-1
సంపుటము: 1-182
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
చెల్లుఁ గాకిటు నీకే చింతింపఁగా పూరి-
పుల్ల మేరువు సేయ భూమిలో నిపుడు
॥చెల్లు॥
చెలఁగి నే మునుసేసిన చేఁత లుండఁగా
మలసి నేఁ దిరుగు తిమ్మట లుండఁగా
తొలఁగఁదోసి తుప్పుడుతోడనే లోహంబు
వెలయ బంగారు గావించిన గతిని
॥చెల్లు॥
బిగిసి నామైనున్న పెనుకట్లుండఁగా
జగడగాండ్లు పగ చాటఁగను
జిగిగల చేఁతి ముసిఁడికాయయగు నన్ను
మొగిఁ గల్పకము ఫలముగఁ జేయ వసమా
॥చెల్లు॥
పొదిలిన యింద్రియంబులు వెంట రాఁగా
మదవికారము నే మరుగఁగానే
వదలకు వేంకటేశ్వర నన్ను నిదే నీ
పదపంకజములు చేర్పఁగ నిది వసమా
॥చెల్లు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము