Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 336-4
సంపుటము: 4-211
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పళవంజరం
ఒక్కమాఁటలోనివే వొగి బంధమోక్షాలు
చిక్కినందాఁకా దేహి చింతఁ బొందీఁ గాని
॥పల్లవి॥
హరి యని నుడిగి రెండక్షరాలఁ బాపేటి-
దురితాలు భూవిలోనఁ దొల్లె లేవు
పురిగొని యందుమీఁద పొంచి విశ్వాసములేక
పెరగఁగఁ బెరుగఁగ పెచ్చు రేఁగీఁగాని
॥ఒక్క॥
మతిలో గోవింద యన్న మాత్రమున నంటేటి
అతిపుణ్యాలిలమీద నన్ని గలవా
కతగా నట్టె మహిమగానలేక వుండగాను
బతిమాలఁగానే యింత బయలాయఁగాని
॥ఒక్క॥
శ్రీవేంకటేశ నిన్ను సేవించితే నిచ్చేటి-
యేవల వరాలు లెక్క నెంచవసమా
భావించి తెలిసి చేపట్టెడి యరుదింత
దైవము నా కియ్యఁగాను దక్కె నింతేకాని
॥ఒక్క॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము