Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 336-5
సంపుటము: 4-212
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
తలరో లోకాంత(ర)పరులు తడవము పుణ్యపాపమును
వలెనని శ్రీవైష్ణవులకు వందనమే సేసెడివాఁడ
॥పల్లవి॥
తపసిఁ గాను ధర్మిఁ గాను
కృపగల శ్రీపతి కింకరుఁడ
జపితఁ గాను శాస్త్రిఁగాను
వుపదేశపు గురువూళిగకాఁడ
॥తల॥
భయము లేదు భక్తి లేదు
జయభాగవతుల దయవాఁడ
ప్రియము న్నెరఁగను పెరిమ న్నెరఁగను
ద్వయాధికారముఁ దగిలినవాఁడ
॥తల॥
జ్ఞానము లేదు మోనము లేదు
పూని శ్రీవేంకట పురుషుఁడిదె
నానాటఁ దెలిపి నను మన్నించెను
సానఁదేరి తన శరణమువాఁడ
॥తల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము