Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 30-2
సంపుటము: 1-183
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
చక్రమా హరిచక్రమా
వక్రమైన దనుజుల వక్కలించవో
॥చక్రమా॥
చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని
చట్టలు చీరిన వో చక్రమా
పట్టిన శ్రీహరి చేతఁ బాయక యీ జగములు
వొట్టుకొని కావగదవో వోచక్రమా
॥చక్రమా॥
పానుకొని దనుజుల బలుకిరీటమణుల
సానలఁ దీరిన వో చక్రమా
నానాజీవముల ప్రాణములుగాచి ధర్మ-
మూని నిలుపఁగదవో వో చక్రమా
॥చక్రమా॥
వెఱచి బ్రహ్మాదులు వేదమంత్రముల[1] నీ
వుఱుట్లు గొనియాడే రో చక్రమా
అఱిముఱిఁ దిరువేంకటాద్రీశు వీధుల
వొఱవుల మెఱయుదువో వో చక్రమా
॥చక్రమా॥

[1] ‘లని వుఱట్లు’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము