Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 338-5
సంపుటము: 4-224
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
నీటముంచు పాలముంచు నీచిత్త మిఁకను
చాటితి నీకృప గురి సంసారమునకు
॥పల్లవి॥
హరి నీవే గురి నాయాతుమలోపలికి
అరిది శంఖచక్రాలే యంగపుగురి
పరమపదమే గురి పట్టినవ్రతమునకు
తిరుమంత్రమే గురి దిష్టపునాలికకు
॥నీట॥
గోవింద నీపాదపూజే గురి నాదాస్యమునకు
తావుల నాభక్తికి నీదాసులే గురి
ఆవల నాకర్మమున కాచార్యుఁడే గురి
దేవ నీశరణు గురి దిష్టపు జన్మానకు
॥నీట॥
నగుశ్రీపతి గురి నన్ను రక్షించుటకును
తగుసంకీర్తన గురి తపమునకు
తెగనిజ్ఞానమునకు తిరుమణులే గురి
మిగుల శ్రీవేంకటేశ మించి నీవే గురి
॥నీట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము