అధ్యాత్మ సంకీర్తన
రేకు: 30-3
సంపుటము: 1-184
రేకు: 30-3
సంపుటము: 1-184
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు బట్టబయలు యీసంసారంబని గుట్టు దెలియలేవు ప్రాణీ | ॥వట్టి॥ |
| చాల నమ్మి యీ సంసారమునకు సోలి సోలి తిరిగేవు బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు [1]మాలెమీఁద పరు వెందాఁకా నీ మచ్చిక విడువఁగ లేవు | ॥వట్టి॥ |
| మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు నానావిధముల [2]దుష్కర్మంబులు నానాటికి నాటించేవు మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగ లేవు | ॥వట్టి॥ |
| [3]పామరివై దుర్వ్యాపారమునకు పలుమారునుఁ బొయ్యేవు వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగా లేవు తామసమతివయి వేంకటనాథుని తత్వ మెఱఁగఁగా లేవు | ॥వట్టి॥ |
[1] ‘మాళిగ’కు వ్యావహారికరూపమా? తేనె దీయునప్పుడు కొండచరుల నడుమ గట్టెడి చిన్నమంచెవంటిదియా?
[2] ‘దుఃక్కర్మ’ రేకు.
[3] ‘పామర’ శబ్దమునకు వ్యావహారికశబ్దము కావచ్చు.


