Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 339-2
సంపుటము: 4-227
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక
కటకటా శునకపుగతియాయఁ గావవే
॥పల్లవి॥
పసిమిఁ బాపమనేటి బందెలు మేసితిని
కసరి దేహపు కట్టుగాడి నుంటిని
కొసరి కర్మపుమెడగుదియ మోఁచితిని
పసురమువంటివాఁడఁ బాలించవే
॥అటు॥
పంచేంద్రియములనే బాడిగె మోఁచితిని
లంచపు సంసారమనే లాడిఁబడితి
పంచల నాసలచేత బందమ వెట్టించుకొంటి
ముంచినగుఱ్ఱమువంటి మూఢుఁడఁ గావవే
॥అటు॥
మరిగి ‘యజ్ఞాన’మనేమద మెత్తి తిరిగితి
‘మరుఁ’ డనే మావటీని మాయఁ జిక్కితి
గరిమ శ్రీవేంకటేశ కరిఁ గాచితివిగాన
కరి నైతి నన్ను నీవు కరుణించవే
॥అటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము