Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 339-3
సంపుటము: 4-228
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసి
లోకమింతా నిండె లోచూపు వెలిచూపు
శ్రీకాంతుఁడై తోఁచె చిక్కినవి యాలా
॥పల్లవి॥
సకలజీవులలోన సర్వేశ్వరుఁడు వాఁడె
వొకరి నౌఁగాదన నోపను నేను
అకట యాతనిచేఁతే అందరునుఁ జేసేవారే
వికటాలెందుకు నాడ వెరపయ్యీ నాకు
॥లోక॥
భువియందు దీని యందు పురుషోత్తముఁడు వాఁడె
వివరించ మేలు గీడు వెదక నే నోప
చెవి విన్న మాటలెల్ల శ్రీపతియై తోఁచీని
ఇవల కల్లనిజాలు యెంచఁజాల నేను
॥లోక॥
పగటందు రేయందు పరమాత్ముఁడు వీఁడె
తగిలి పాసే నన్న తలఁపునోప
జిగి మించ నాలోన శ్రీవేంకటేశుఁడే
బగివాయఁ డెన్నఁడును బదుకవో మనసా
॥లోక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము