Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 30-4
సంపుటము: 1-185
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఈ భవమునకుఁ జూడ నేది గడపల తనదు-
ప్రాభవం బెడలించి బాధఁ బెట్టించె
॥ఈ భవ॥
చెప్పించెఁ బ్రియము వలసినవారలకునెల్ల
రప్పించె నెన్నఁడును రానిచోట్లకును
వొప్పించె నాసలకు వోరంత [1]ప్రొద్దునను
తిప్పించె కోరికల తిరిగి నలుగడల
॥ఈ భవ॥
పుట్టించె హేయంపు భోగయోనులనెల్ల
కట్టించె సంసారకలితబంధముల
పెట్టించె ఆసలను పెడ[2]కొడములఁ దన్ను
తిట్టించె నిజద్రవ్యదీపకుల చేత
॥ఈ భవ॥
బెదరించె దేహంబు పెనువేదనలచేత
చెదరించె శాంతంబు చెలఁగి చలమునను
విదళించె భవనములను వేంకటేశ్వరుఁ గొలిచి
పదిలించె నతని కృప పరమసౌఖ్యములు
॥ఈ భవ॥

[1] ‘రొద్దు’ రేకు.

[2] ‘కొడము’ ప్రవాహమున చేపలను పట్టుటకు ఒడ్డెడి సాధనము కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము