Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 340-5
సంపుటము: 4-236
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళం
ఉన్న సుద్దులేల మాకు వూర విచారములెల్ల
వెన్నునికి మొక్కుటే వేవేలు మాకు
॥పల్లవి॥
నగధర నందగోప నరసింహ వామన
జగదేకపతియనే జపము మాది
తగు హరిడింగరీఁడ దాసుఁడ బంటననేటి-
మిగులఁ బెద్దతనము మించేది మాకు
॥ఉన్న॥
హరి పుండరీకాక్ష ఆదినారాయణయనేటి-
ధర నామమంత్రములే ధనము మాకు
సరుస శంఖచక్రాలు సర్వేశుదాసుల సేవె
మరిగినదె మామతమును మనికె
॥ఉన్న॥
శ్రీవేంకటేశయని శేషగిరివేదాద్రి
భావించి కొలుచుటే మాబ్రదుకెల్లను
కైవల్యమిదియె కంటి మిట్టి మంచిత్రోవ
పావనమైతిమి మమ్ముఁ బాలించె నితఁడు
॥ఉన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము