Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 341-1
సంపుటము: 4-238
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
కన్నవారివద్ద నెల్లఁ గావంగ నేమి గద్దు
యిన్నిటికి నియ్యఁగొన నీతఁడే స్వతంత్రుఁడు
॥పల్లవి॥
పరిమేష్ఠిగన్నతండ్రిఁ బాటించి కొలువరో
అరుదై లోకాలకెల్ల నతఁడే తండ్రి
సిరిమగఁడైనవానిఁ జేపట్టి తలఁచరో
సిరులిచ్చేమేఁటిదాత సృష్టికెల్ల నతఁడే
॥కన్న॥
అంబరీషుఁ గావఁ జక్రమంపినవానిఁ జేరరో
అంబుజభవాండాన కతఁడే రక్ష
పంబిన భూకాంతపతిఁ బాయక సేవించరో
వుంబళ్లు వూళ్లు నిచ్చేవున్నతుఁడు నతఁడే
॥కన్న॥
మూలమంటేఁ గరిఁగాచేముఖ్యునికి మొక్కరో
మూలధనమైయుండీ ముందర నిట్టె
యీలీలఁ జిత్తజుతండ్రి నెదలోనఁ గొలువరో
పాలించ శ్రీవేంకటాద్రిపతియాయ నితఁడే
॥కన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము