అధ్యాత్మ సంకీర్తన
రేకు: 30-5
సంపుటము: 1-186
రేకు: 30-5
సంపుటము: 1-186
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ఎంత పాపకర్మమాయ [1]యెంత వింతచింతలాయ వింతవారితోడి పొందు వేసటాయ దైవమా | ॥ఎంత॥ |
| చూడఁ జూడఁ గొత్తలాయ చుట్టమొకఁడు లేఁడాయ వీడుఁ బట్టు ఆలుచాయ వేడుక లుడివోయను జోడు జోడు గూడదాయ చొక్కుఁదనము మానదాయ యేడకేడ తలపోఁత యెంతసేసె దైవమా | ॥ఎంత॥ |
| నీరులేని యేఱు దాఁటనేర దెంతేలోఁతాయ మేరవెళ్ల[2] నీఁదఁడాయ మేఁటిఁ జేరఁడాయను తోరమైన ఆస లుబ్బి తోవ గానిపించదాయ కోరి రాకపోకచేత కొల్లఁబోయఁ గాలము | ॥ఎంత॥ |
| తల్లి దండ్రి దాత గురువు తానెయైన నాచారి[3]- వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు మొల్లమాయ నామనసు మోదమాయ దైవమా | ॥ఎంత॥ |
[1] ‘యంత’ రేకు. ప్రాసయతి కూర్చిరేమో.
[2] ‘వేళ్ల’ పూ.ము.పా.
[3] ‘నాంచారి’ ఏమో? ‘నాచ్చియార్’ తమిళము.


