అధ్యాత్మ సంకీర్తన
రేకు: 342-6
సంపుటము: 4-249
రేకు: 342-6
సంపుటము: 4-249
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| అనుచు మునులు ఋషు లంతనింత నాడఁగాను వినియు విననియట్టె వీడె యాడీఁ గాని | ॥పల్లవి॥ |
| ముకుందుఁ డితఁడు మురహరుఁ డితఁడు అకటా నందునికొడుకాయఁగాని శకుంతగమనుఁ డితడు సర్వేశుఁ డితఁడు వెకలి రేపల్లెవీధి విహరించీఁగాని | ॥అను॥ |
| వేదమూరితి ఇతఁడు విష్ణుదేవుఁ డితఁడు కాదనలేక పసులఁ గాచీఁగాని ఆదిమూల మితఁడు యమరవంద్యుఁ డితఁడు గాదిలిచేఁతల రోలఁ గట్టువడెఁగాని | ॥అను॥ |
| పరమాత్ముఁ డితఁడే బాలుఁడై వున్నాఁడుగాని హరి యీతఁడే వెన్నముచ్చాయఁగాని పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతఁడె తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీఁగాని | ॥అను॥ |


