అధ్యాత్మ సంకీర్తన
రేకు: 343-6
సంపుటము: 4-255
రేకు: 343-6
సంపుటము: 4-255
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| కలఁడా యింతటి దాత కమలనాభుఁడే కాక కలఁడన్న వారిపాలఁ గలిగిన దైవము | ॥పల్లవి॥ |
| యిచ్చెను సంపద లితఁడింద్రాదులకునెల్ల యిచ్చెను శుకాదుల కిహపరాలు యిచ్చెను వాయుజునికి యిటమీఁద బ్రహ్మపట్ట- మిచ్చల ఘంటాకర్ణుని కిచ్చెఁ గుబేరత్వము | ॥కల॥ |
| కట్టెను ధ్రువపట్టము కమలజుకంటే మీఁద కట్టె విభీషణుకు లంకారాజ్యము కట్టియిచ్చె నజునికి గతచన్నవేదాలు కట్టెను శ్రీసతిచేత గంకణసూత్రములు | ॥కల॥ |
| పెట్టెను దేవతలకు పేరినమృతపువిందు వెట్టెను భక్తవత్సలబిరు దితఁడు యిట్టె శ్రీవేంకటాద్రి నిందరికిఁ బొడచూపి పెట్టెఁ దనపస్రాదము పృథివి జీవులకు | ॥కల॥ |


