Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 344-2
సంపుటము: 4-257
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
బాపురే నీమాయ భ్రమయించీ జీవులకు
దాపున నున్నదేకాని దవ్వలకుఁ జొరదు
॥పల్లవి॥
మోక్షమురుచి గానదు ముందర నుండఁగాను
సాక్షియై జగమిది చవి చూపఁగా
దీక్షకుఁ జొరదు మరి దేవ నీపై భక్తి లేదు
దక్షులై యాలుబిడ్డలు దండనుండఁగాను
॥బాపు॥
జ్ఞానమితవు గాదు సంగడి నుండదుగాన
నానాయోనులమేను ననిచుండఁగా
ఆనకమై వైరాగ్యమంట దలవాటులేక
కానఁబడ కర్మములు గాసిఁ బెట్టఁగాను
॥బాపు॥
మంచిదని నీ తిరుమంత్రము దలఁచుకోదు
పంచేంద్రియములాత్మ బలిశుండఁగా
యెంచుకొని శ్రీవేంకటేశ నీకే శరణని
అంచల నీదాసులైతే నన్నిటా గెలిచిరి
॥బాపు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము