అధ్యాత్మ సంకీర్తన
రేకు: 344-5
సంపుటము: 4-260
రేకు: 344-5
సంపుటము: 4-260
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసి
| అజ్ఞానులకివి యరుహము లింతే సుజ్ఞానులకివి చొరనేలయ్యా | ॥పల్లవి॥ |
| దైవమునమ్మినదాసులకు కావింపఁగ మరి కర్మము లేదు దావతిజలనిధి దాఁటినవారికి వోవల మరియును వోడేలయ్య | ॥అజ్ఞా॥ |
| గురుకృప గలిగిన గుణనిధికి అరయఁ బాపపుణ్యము మరి లేదు విరసపుఁ జీఁకటి వెడలినవారికి పరగ మరియు దీపంబేలయ్య | ॥అజ్ఞా॥ |
| జగములెరుఁగు వైష్ణవులకును తగిలెటి యపరాధంబులు లేవు అగపడి శ్రీవేంకటాధిపుఁ గొలిచితే యెగువ దిగువ మాకెదురేదయ్య | ॥అజ్ఞా॥ |


