Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 31-1
సంపుటము: 1-188
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
పారకుమీ వోమనసా పంతము విడువకుమీ మనసా
పారిన నీవే బడగయ్యెదవు చేరువ నాఁడే చెప్పవె మనసా
॥పారకు॥
చింతించకుమీ శివునివైరిచే చిక్కువడకుమీ వోమనసా
కంతువారకము వయసుఁ బ్రాయములు కావటికుండలు వోమనసా
[1]యెంతే మేలుఁ గీడేకాలము ఎప్పుడు నుండదు వోమనసా
సంతరించుకో వానిని మనసున సంతోషముగా వోమనసా
॥పారకు॥
యెన్నికలే తలపోయకుమీ యేమరకుండుమి వోమనసా
కన్న విన్న వారిలో నెప్పుడు కాకుపడకుమీ వోమనసా
పున్నమమాసలు పుడమిలో బదుకులు పోయివచ్చేవి వోమనసా
మిన్నో నేలని మన్న దినములో మీఁదుచూడకుమి వోమనసా
॥పారకు॥
కన్నుల సంగాతము సేయకుమీ కళవళించకుమి వోమనసా
వన్నెలమాటలు చెవులఁ బెట్టక వాసి విడువకుమి వోమనసా
మున్నిఁటి సురలు బ్రహ్మాదులకైనను ముక్తిసాధనము వోమనసా
వెన్నుని వేంకటగిరిపతిఁ దలఁచుము వేసారకుమీ వోమనసా
॥పారకు॥

[1] ‘యెంతో మేలూఁ గీ’ అని పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము