Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 346-6
సంపుటము: 4-273
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
పంతగాఁడు మిక్కిలి నీ పవనజుఁడు
రంతుకెక్కె మతంగపర్వత పవనజుఁడు
॥పల్లవి॥
వాలాయమై యెంతభాగ్యవంతుఁడో దేవతలచే
బాలుఁడై వరములందెఁ బవనజుఁడు
పాలజలనిధి దాఁటి పరగ సంజీవి దెచ్చి
యేలికముందరఁ బెట్టె యీ పవనుజుఁడు
॥పంత॥
సొంటులు సోదించితెచ్చి సుగ్రీవు రాఘవునికి
బంటుగాఁగఁ బొందుసేసెఁ బవనజుఁడు
వొంటినే రామునిముద్ర వొసఁగి సీతముందర
మింటిపొడవై పెరిగె మేఁటి పవనజుఁడు
॥పంత॥
కిట్టి శ్రీవేంకటేశ్వరుకృపచే ముందరిబ్రహ్మ-
పట్ట మేలనున్నవాఁడు పవనజుఁడు
చుట్టి చుట్టి తనకు దాసులయినవారికి
గట్టి వరములిచ్చె నీ ఘనపవనజుఁడు
॥పంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము