అధ్యాత్మ సంకీర్తన
రేకు: 347-1
సంపుటము: 4-274
రేకు: 347-1
సంపుటము: 4-274
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఏడకేడ నీచెరిత లేమని పొగడవచ్చు యీడులేని మహిమల యినవంశరామా | ॥పల్లవి॥ |
| పరమాన్నములోఁబుట్టి పక్కనఁ దాటకిఁ జంపి సరుస విశ్వామిత్రుయజ్ఞము గాచి హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లాడి పరశురామునిచేత బలము చేకొంటివి | ॥ఏడ॥ |
| వైపుగాఁ సుగ్రీవుఁ గూడి వాలి నొక్కకోల నేసి యేపున జలధి గట్టి యెసగితివి దీపించు రావణుఁ జంపి దివిజులను మన్నించి యేపుగా విభీషణుని రాజ్య మేలించితివి | ॥ఏడ॥ |
| సీతతోఁ బుష్పకమెక్కి జిగి నయోధ్యకు వచ్చి గాతల రాజ్యపట్టము గట్టుకొంటివి యీతల శ్రీవేంకటాద్రి నిటు విజనగరాన నీతితో నెలవుకొని నెగడితివి | ॥ఏడ॥ |


