అధ్యాత్మ సంకీర్తన
రేకు: 348-5
సంపుటము: 4-283
రేకు: 348-5
సంపుటము: 4-283
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| రామునికి శరణంటె రక్షించీ బ్రదుకరొ యేమిటికి విచారాలు యిఁక దైత్యులాల | ॥పల్లవి॥ |
| చలమునఁ దాటికిఁ జదిపిన బాణము లలి మారీచసుబాహూలపై బాణము మెలఁగి పరశురాము మేట్లేసిన బాణము తళతళ మెరసీని తలరో యసురలు | ॥రాము॥ |
| మాయామృగముమీఁద మరి వేసిన బాణము చేయి చాఁచి వాటి నేసిన బాణము తోయధిమీఁద నటు తొడిగిన బాణము చాయలు దేరుచున్నది చనరో దైతేయులు | ॥రాము॥ |
| తగఁ గుంభకర్ణునితల ద్రుంచిన బాణము జిగి రావణుఁ బరిమార్చిన బాణము మిగుల శ్రీవేంకటేశు మేఁటిపొదలో నున్నది పగ సాధించీ నిఁకఁ బారరో రాకాసులు | ॥రాము॥ |


