Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 31-3
సంపుటము: 1-190
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఎట్టు దరించీ నిదె యీజీవుఁడు
బట్టబయలుగాఁ బరచీ నొకటి
॥ఎట్టు॥
చెడని మట్టిలోఁ జేసిన ముద్దే
నడుమ ముంచుకొన్నది వొకటి
తడియని నీరై తడి వొడమింపుచు
వడిసీని వేపుర వడితో నొకటి
॥ఎట్టు॥
పాయని తనుదీపనములుగా నటు
చేయుచు మది వేఁచీ నొకటి
కాయపు చుట్టరికమ్ములు చేయుచు
రేయుఁబగలు విహరించీ నొకటి
॥ఎట్టు॥
యిన్నియుఁ దానే యేచి కపటములు
పన్నీ నిదె లోపల నొకటి
వెన్నెల చూపుల వేంకటేశ నిను
యెన్నికతోఁ గడు నెదిరీ నొకటి
॥ఎట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము