Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 349-2
సంపుటము: 4-286
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
వీధుల వీధుల విభుఁ డేఁగీ నిదె
మోదము తోడుత మొక్కరొ జనులు
॥పల్లవి॥
గరుడధ్వజ మదె కనకరథం బదె
అరదముపై హరి యలవాఁడె
యిరుదెసల నున్నారు యిందిరయు భువియు
పరఁగ బగ్గములు పట్టరో జనులు
॥వీధు॥
ఆడే రదివో యచ్చరలెల్లను
పాడేరు గంధర్వపతులెల్లా
వేడుకతో వీఁడె విష్వక్సేనుఁడు
కూడి యిందరునుఁ జూడరో జనులు
॥వీధు॥
శ్రీవేంకటపతిశిఖరముచాయదె
భావింప బహువైభవము లవే
గోవిందనామపుఘోషణ లిడుచును
దైవం బితఁడని తలఁచరో జనులు
॥వీధు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము