అధ్యాత్మ సంకీర్తన
రేకు: 349-3
సంపుటము: 4-287
రేకు: 349-3
సంపుటము: 4-287
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవశ్రీ
| శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను శ్రీవిభుఁ డుదయించెఁ జెలులాల వినరే | ॥పల్లవి॥ |
| అసురల శిక్షించ నమరుల రక్షించ వసుధ భారమెల్లా నివారింపను వసుదేవునికిని దేవకీదేవికిని అసదృశమగు కృష్ణుఁ డవతారమందెను | ॥శ్రావ॥ |
| గోపకలమన్నించ గొల్లలనెల్లాఁ గావఁగ దాపై మునులనెల్లా దయసేయను దీపించ నందునికి దేవియైన యశోదకు యేపున సుతుఁడై కృష్ణుఁ డిన్నిటాఁ బెరిగెను | ॥శ్రావ॥ |
| పాండవుల మనుపఁగ పదారువేలఁ బెండ్లాడఁగ నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండఁగా అండ నలమేల్మంగ నక్కునఁ గాఁగలించఁగ దండియైయుండఁ గృష్ణుఁడు తగ నుతికెక్కెను | ॥శ్రావ॥ |


