Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 350-4
సంపుటము: 4-294
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాగవరాళి
దైవము నెరఁగము తత్వముఁ దలఁచము
చేవై హరి రక్షించీ నిదివో
॥పల్లవి॥
పాపముఁ బుణ్యముఁ బైకొను దేహము
కోపము శాంతపుగుణములది
వోపికవోపము లుదుటు చూపెడిది
చేపట్టుక యిటు చెలఁగే మిదివో
॥దైవ॥
వెలికిని లోనికి విడిసేటిప్రాణము
చలువలు వేండ్లు చల్లెడిది
తెలివికి నిదురకుఁ దేపై యున్నది
బలిమిఁ జేపట్టుక బ్రదికే మిదివో
॥దైవ॥
పరమును నిహమునుఁ బట్టినజీవుఁడ
పొరుగుకు నింటికిఁ బొత్తైతి
గరిమల శ్రీవేంకటపతి శరణని
నిరతపు మహిమల నెగడే మిదివో
॥దైవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము