Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 355-4
సంపుటము: 4-324
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
తెలియనివారికిఁ దెరమరుఁగు
తెలిసినవారికి దిష్టంబిదియే
॥పల్లవి॥
కన్నులయెదుటనుఁ గాంచినజగ మిది
పన్నిన ప్రకృతియు బ్రహ్మమునే
యిన్నిట నుండఁగ నిదిగాదని హరిఁ
గన్న చోట వెదకఁగఁబోనేలా
॥తెలి॥
అగపడి యిరువదియైదై జీవునిఁ
దగిలినవెల్లాఁ దత్వములే
నగవుల నిదియును నమ్మగఁ జాలక
పగటునఁ దమలో భమ్రయఁగ నేలా
॥తెలి॥
అంతరంగుఁడును నర్చావతారము
నింతయు శ్రీవేంకటేశ్వరుఁడే
చెంతల నీతనిసేవకులకు మరి
దొంతికర్మములతోడ సిఁకనేలా
॥తెలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము