Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 358-1
సంపుటము: 4-339
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
నాఁటకమింతా నవ్వులకే
పూఁటకుఁ బూఁటకుఁ బొల్లైపోవు
॥పల్లవి॥
కోటివిద్యలునుఁ గూటికొఱకె పో
చాటువ మెలఁగేటి శరీరికి
తేటల నాఁకలిదీరినపిమ్మట
పాటుకుఁ బాటే బయలైపోవు
॥నాఁట॥
మెఱసేటిదెల్లా మెలుఁతలకొరకే
చెఱలదేహములజీవునికి
అఱమరపుల సుఖమందినపిమ్మట
మొఱఁగుకుమొఱఁగే మొయిలై పోవు
॥నాఁట॥
అన్ని చదువులును నాతనికొరకే
నన్నెరిఁగిన సుజ్ఞానికిని
యిన్నిట శ్రీవేంకటేశుదాసునికి
వెన్నెలమాయలు విడివడిపోవు
॥నాఁట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము