Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 358-5
సంపుటము: 4-343
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎన్నఁడు విజ్ఞానమిఁక నాకు
విన్నపమిదె శ్రీవేంకటనాథా
॥పల్లవి॥
పాసినఁ బాయపు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసినఁ దొలఁగవు కోరికలు
గాసిలి చిత్తముగలిగినన్నాళ్ళు
॥ఎన్న॥
కొచ్చినఁ గొరయవు కోపములు
గచ్చులగుణములుగలనాళ్ళు
తచ్చినఁ దలఁగవు తహతహలు
రచ్చల విషయపురతులన్నాళ్లు
॥ఎన్న॥
వొకటికొకటికిని వొడఁబడవు
అకట శ్రీవేంకటాధిపుఁడ
సకలము నీవే శరణంటే యిఁక
వికటములణఁగెను వేడుకనాళ్ళు
॥ఎన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము