Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 359-1
సంపుటము: 4-345
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
నీవే కాచుట గాక నేరుపు నా యందేది
చేవల వేఁపమాను చేఁదు మానీనా
॥పల్లవి॥
వొరసి దుర్గుణములనుమానిన నాచిత్తము
మరలి మంచిగుణాన ముట్టుపడీనా
హరి నిన్నుఁ దలఁచక యడవిఁబడిన మరి(తి?)
దరిచేరి నిన్ను మతిఁ దలఁచఁబోయీనా
॥నీవే॥
పాలుమాలి యింద్రియాల బారిఁబడ్డ పుట్టువిది
ఆలరి వైరాగ్యసుఖ మందఁబోయీనా
నీలవర్ణ నినుమాని నిత్యసంసారైన నేను
కాలమందే నిన్నెరఁగఁ గలనా నేను
॥నీవే॥
గరిమ సుజ్ఞానము గలిగిన సాత్విక -
మరయ వేరొకచోట వణఁగీనా
యిరవై శ్రీవేంకటేశుఁడ నీకరుణబ్బె
శరణాగతుఁడ నాకు స్వతంత్రమా
॥నీవే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము