Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 359-5
సంపుటము: 4-349
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
ఎన్నఁడు నేఁ గందు నిందు నిందిరాపతి నీవే
కన్ను లెదుటనుండి కరుణింతు గాక
॥పల్లవి॥
పొడమినయట్టె నిన్ను పొంచికొలిచేనంటే
కడు నాకప్పుడు వివేకము చాలదు
అడరి యంతటిమీఁదనైనాఁ దెలియఁబోతే
వడి జవ్వన మదము వశమిందుగాదు
॥ఎన్నడు॥
వెనక నేఁ బ్రౌడనై విరతిఁ బొందేనంటే
ధనవాంచ నేమియుఁ దడవనీదు
తనువు ముదిసి నీకుఁ దపముసేసేనంటే
వోనర నేమిటికి వోపికలేదు
॥ఎన్నడు॥
శ్రీ వేంకటేశ యీ సిలుగులఁబెట్టనేల
కైవశమై నీవు గలిగుండఁగా
నీవే కృపసేసి నేఁడిటుగావకున్న
పావనమైన యీ పదవెందుఁగద్దు
॥ఎన్నడు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము