అధ్యాత్మ సంకీర్తన
రేకు: 359-6
సంపుటము: 4-350
రేకు: 359-6
సంపుటము: 4-350
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇందరి గాచిన నీవు యిట్టే నీవు నాకు కందువ నిధానమవై కలవుగా నీవు | ॥పల్లవి॥ |
| అరసి ధ్రువుని గాచినట్టి నీవు కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచిన నీవు కరిరాజు శరణంటేఁ గాచిన నీవు కరతలామలకమై కలవుగా నీవు | ॥ఇందరి॥ |
| గట్టిగా విభీషణుఁగాచిన నీవు అట్టె ద్రౌపదిఁ గాచినప్పటి నీవు చెట్టవట్టి బలిఁగాచిన నీవు నాకు కట్టిన ముడుపవై కలవుగా నీవు | ॥ఇందరి॥ |
| కమ్మర సుగ్రీవునిఁ గాచిన నీవు నేఁడు కిమ్ముల లోకములు రక్షించే నీవు నెమ్మది శ్రీ వేంకట నిలయ నీవు మాకు కమ్ముకొని దాపుదండై కలవుగా నీవు | ॥ఇందరి॥ |


