Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 363-5
సంపుటము: 4-373
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
అది బ్రహ్మాండం బిది పిండాండం -
బుదుటు జీవులము వున్నార మిదివో
॥పల్లవి॥
వుదయాస్తమయము లొనరినవలెనే
నిదురలు మేల్కను నియమములు
కదిసి త్రిసంధ్యాకాలంబులవలె
గుదిగొను దేహికి గుణత్రయములు
॥అది॥
పుడమి నస్యములు పొదలినవలెనే
వొడలిరోగము లున్న వివే
వుడుగని వెలుపటి వుద్యోగమువలె
కొడిసాగేటి మితి కోరికలు
॥అది॥
వెలుపలఁగల శ్రీ వేంకట విభుఁడే
కలఁ డాతుమలో ఘనుఁ డితఁడే
చలమున నీతని శరణాగతియే
ఫలమును భాగ్యము బహుసంపదలు
॥అది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము