అధ్యాత్మ సంకీర్తన
రేకు: 363-6
సంపుటము: 4-374
రేకు: 363-6
సంపుటము: 4-374
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| ఏమి సేయవచ్చు హరి యెలయించే మాయ లివి వేమరు నాతనిఁ గొల్చి వీడుకొంట గాక | ॥పల్లవి॥ |
| పాయమే పరచైతేఁ బట్టఁగ నెట్లవచ్చు రోయుదాఁకా నందులోఁ దిరుగుటగాక కాయపువోడ తప్పుగాలి విసరినవేళ పోయినట్టే పోనిచ్చి పొనుఁగుటగాక | ॥ఏమి॥ |
| మనసే మలినమైతే మఱుఁగెట్టు సేయవచ్చు వొనర విరతిదాఁక నోర్చుటగాక తన యంతరంగపుటద్దము మాసితే నది మినుకు విజ్ఞానాన మెరుఁగిచ్చుటగాక | ॥ఏమి॥ |
| మెచ్చునాలుకఁదీపు మింగ కెట్టుమానవచ్చు కొచ్చి కొచ్చి సారె రుచిగొనుటగాక నచ్చుల శ్రీ వేంకటేశు నామము నోరనుంటే పచ్చి తనభాగ్యమంటా బ్రదుకుటగాక | ॥ఏమి॥ |


