Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 374-1
సంపుటము: 4-432
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
వెనక ముందరికిఁ బెద్దలకెల్లను వివరపు సమ్మతి యీ వెరవు
వెనుకొని తన గురునాథుని యనుమతి వేదోక్తంబగు నీ తెరువు
॥పల్లవి॥
కనకాసక్తుఁడు గాకుండుట మది కైవల్యమునకు నొకతెరువు
వనితల భ్రమలను వలలఁ దగులని మది వైకుంఠమునకు నొకతెరువు
మునుకొపముఁ బెడఁబాసిన మతి మోక్షంబునకును నొకతెరువు
యెనసి యిందుప హరిఁదలఁచినమతి యిన్నిటికెక్కుడు యీ తెరువు
॥వెన॥
నిరతి విషయముల నణఁచిన దృఢమతి నిశ్శ్రేయమున కొకతెరువు
విరతితోడ నెలవై నమతి విభవపుఁ బరమున కొకతెరువు
వెరపున నిందరిమీఁదటిసమమతి విష్ణులోకమున కొకతెరువు
యిరవెరిఁ గంతట హరి నమ్మినమతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు
॥వెన॥
పన్నినకోరిక తెగఁగోసినమతి పరమపదమునకు నొకతెరువు
వున్న విచారములుడిగించినమతి వున్నతపదమున కొకతెరువు
సన్నుతి భగవద్దాసుల దాస్యమె చలమతి ముక్తికి నొకెతెరువు
యిన్నిట శ్రీవేంకటపతిశరణమె హితమతి నెక్కుడు యీ తెరువు
॥వెన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము