Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 377-4
సంపుటము: 4-450
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
హరిహరి నిను సకలాంతర్యామివి(ని?) ఆత్మఁ దలఁచుటే యోగంబు
శరణాగతరక్షామణి నిన్నే శరణనియెడిదే తుదిపదము
॥పల్లవి॥
నీయందే యీసచరాచరమును నీవే చరాచరమందు నిత్యమును
పాయక వుండుట గని తలపోయుట పరమార్థంబుల సారంబు
కాయము జీవుఁడు నీయధీనమై కలుగఁగఁ బ్రకృతియుఁ బురుషునిఁగానిటు
మాయల ముంతువు మాయకుఁ జొరవని మతిఁ దలపోయుట సుజ్ఞానంబు
॥హరి॥
తనలోఁ బరతత్వపు నీవును తా నీపరతత్వములోపలఁగా
మనసునఁ దలఁచుట వేదాంతంబుల మంతనముల సన్మార్గంబు
ఘనమునకును మరి ఘనమై యందే కడుసూక్ష్మమునకుఁ గడు సూక్ష్మంబై
యెనసిన పూసలలోదార మవని యెన్నుటె పరమరహస్యంబు
॥హరి॥
ఆతుమలోపల ఘనవైకుంఠము ఆతుము నీ వైకుంఠములోపల
యీతల నాతల సరిగాఁదెలియుట యిదియే బ్రహ్మానందంబు
శ్రీతరుణీశ శ్రీవేంకటపతి సేవారతి నిను నీ భజియించెద
దాతపు దైవమవై ననుఁగావుము తలఁచెద మిదియే తత్వంబు
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము