అధ్యాత్మ సంకీర్తన
రేకు: 379-1
సంపుటము: 4-459
రేకు: 379-1
సంపుటము: 4-459
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఏలవయ్య లోకమెల్ల యిట్టె రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష | ॥పల్లవి॥ |
| మొదల నింద్రుఁడు నీ మోమునకెల్లా రక్ష యిదె నీ శిరసునకు నినుఁడు రక్ష కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష చెదరని మేనికెల్ల శ్రీ రామరక్ష | ॥ఏల॥ |
| పిరుఁదు వాలమునకు బెడిదపు శక్తి రక్ష గరుడఁడు నీకరయుగముల రక్ష గరిమ నీకుక్షికి కరివరదుఁడు రక్ష సిరుల నీ మహిమకు శ్రీ రామ రక్ష | ॥ఏల॥ |
| వడి నీ పాదములకు వాయుదేవుఁడు రక్ష తొడలకు వరుణుఁడు తొడగు రక్ష విడువని మతికిని వేద రాసులే రక్ష చెడని నీ యాయువుకు శ్రీరామరక్ష | ॥ఏల॥ |
| నలువ నీగళ రక్ష నాలుక కుర్వర రక్ష అలర నీసంధులకు హరుఁడు రక్ష పలు నీరోమములకు బహుదేవతలు రక్ష చెలఁగు నీచేఁతలకు శ్రీ రామరక్ష | ॥ఏల॥ |
| అంగవు నీతేజమున కగ్నిదేవుఁడు రక్ష శృంగారమున కెల్లా శ్రీ సతి రక్ష మంగాంబునిధి హనుమంత నీ కేకాలము చెంగట శ్రీ వేంకటాద్రి శ్రీ రామరక్ష | ॥ఏల॥ |


