అధ్యాత్మ సంకీర్తన
రేకు: 379-3
సంపుటము: 4-461
రేకు: 379-3
సంపుటము: 4-461
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఏమిటివాఁడఁ గాను యిఁక నేను నా - సామపుఁ గర్మము నీకే సమర్పయామి | ॥పల్లవి॥ |
| తలఁపులోపలనున్న తత్వము యిట్టె వెలినుండే నాపాలి విష్ణుమూర్తీ పలుకు లోపల నుండే పరమాత్ముఁడా నా చలమరి మతి నీకే సమర్పయామి | ॥ఏమి॥ |
| పుట్టుగులిచ్చినయట్టి పురుషోత్తమా తుద - ముట్టించు మోక్షపుమురమర్దనా గుట్టుతో నిహముచూపే గోవిందుఁడా నా జట్టి చైతన్యము నీకే సమర్పయామి | ॥ఏమి॥ |
| అరిదిభోగములిచ్చేయంతరాత్ముఁడా నాకు శరణమైనయట్టి సర్వేశ్వరా! వెరసి నన్నేలిన శ్రీ వేంకటేశుఁడా నా సరవులన్నియు నీకే సమర్పయామి | ॥ఏమి॥ |


