Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 380-5
సంపుటము: 4-468
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
వేవేల చందాలవాఁడు విఠలేశుఁడు
భావించ నలవిగాని పరమాత్ముఁ డితఁడు
॥పల్లవి॥
సతతము రుక్మిణీ సత్యభామల నడుమ
రతికెక్కిన సింగారరాయఁ డితఁడు
చతురత సనకాది సంయమీంద్రులమతి-
నతిశయిల్లేటి పరమానంద మితఁడు
॥వేవేల॥
దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుఁగొంది
తావుకొన్న యట్టి యాధార మీతఁడు
మూవంక గొల్లెతలు మున్ను సేసిన తపము
కైవశమై ఫలించిన ఘన భాగ్య మితఁడు
॥వేవేల॥
వరముతో యశోద వసు దేవాదులకు
పరగిన కన్నులపండు గీతఁడు
పిరులు మించినయట్టి శ్రీ వేంకటాద్రిమీఁది-
నిరతి దాసుల పాలి నిధాన మితఁడు
॥వేవేల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము