అధ్యాత్మ సంకీర్తన
రేకు: 380-6
సంపుటము: 4-469
రేకు: 380-6
సంపుటము: 4-469
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తోడి
| సుగ్రీవనారసింహ సులభుఁడ వందరికి - నగ్రేసరుఁడ నీ వవధారు దేవా | ॥పల్లవి॥ |
| సనకాదు లొకవంక జయవెట్టుచున్నారు యెనసి సురలు చేతులెత్తి మొక్కేరు మును లిరుమేలానుండి మునుకొని నుతించేరు అనుపమాలంకార అవధారు దేవా | ॥సుగ్రీ॥ |
| గంగాది నదు లెల్లఁ గడిగీ నీ పాదములు పొంగుచు సప్త రుషులు పూజించేరు సంగతి వాయుదేఁడు సరినాల వట్టమిడీ అంగజ కోటి రూప యవధారు దేవా | ॥సుగ్రీ॥ |
| పరగ నారదాదులు పాడేరు నీ చరితలు పరమ యోగీంద్రులు భావించేరు సిరులు మించిన యట్టి శ్రీ వేంకటాద్రిమీఁద- నరుదుగ నున్నాఁడవు అవధారు దేవా | ॥సుగ్రీ॥ |


