అధ్యాత్మ సంకీర్తన
రేకు: 381-3
సంపుటము: 4-472
రేకు: 381-3
సంపుటము: 4-472
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె హత్తి కానుక లిచ్చేరు అదె రాజరాజులు | ॥పల్లవి॥ |
| రామ రఘ కుల వీర రాజీవ లోచన కోమల శ్యామల వర్ణ కొలువు వేళ వామ దేవాది మునులు వారె, సుగ్రీవుఁడు వాఁడె వేమారును వానర వీరులు మొక్కేరు | ॥చిత్తా॥ |
| దేవ సీతాస మేత ధీర లోక నాయక భావించ నవధరించు పౌఁజువేళ పావని యల్లవాఁడె భల్లూకపతి వీఁడె సేవించీని భరతునిఁ జేకొను శత్రుఘ్నుని | ॥చిత్తా॥ |
| శ్రీమదయోధ్యా విహార శ్రీ వేంకటనివాస సామజ వాజి రథాల సందడివేళ సౌమిత్రి యీవంక విభీషణుఁడు నావలివంక నీ మహిమలెల్లా మెచ్చి నీకు విన్నవించేరు | ॥చిత్తా॥ |


