Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 34-3
సంపుటము: 1-210
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే
వున్నవారి యీవులెల్ల నొద్దికయ్యీనా
॥ఇన్ని॥
తెగని యాపదలకు దేవుఁడే కలఁడుగాక
వగలుడుపఁ బరుల వస మయ్యీనా
నొగిలి యితరలకు నోళ్ళు దెరచిన
నగుఁబాటేకాక మానఁగఁ బొయ్యీనా
॥ఇన్ని॥
అగ్గలపు దురితాలు హరియే మానుపుఁ గాక
బగ్గన నొక్కరు వచ్చి పాపఁ బొయ్యేరా
తగ్గుముగ్గులైన వేళ తలఁచినవారెల్ల
సిగ్గుఁబాటే కాక తమ్ముఁ జేరవచ్చేరా
॥ఇన్ని॥
యెట్టు సేసినను వేంకటేశుఁడే నేరుచుఁ గాక
[1]కట్టఁగడవారెల్లఁ గరుణించేరా[2]
యిట్టే యేమడిగిన నీతఁడే యొసఁగుఁ గాక
వుట్టిపడి యెవ్వరైనా నూరడించేరా
॥ఇన్ని॥

[1] కడ + కడ = ‘కట్టకడ’. ఇక్కడ అరసున్న విచార్యము.

[2] నిడురేకు 88- గావఁబోయేరా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము